పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా
బొమ్మలతొ కొల్వులంట ముంగిట్లో ముగ్గులంట
హరిదాసుల పాటలంట గంగిరెద్దు ఆటలంట
పిల్లగాండ్లకు శెలవలంట ఇళ్ళుబాగ అలికిరంట
పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా
ముగ్గుల్లో గొబ్బెలంట రంగులద్దు పడతులంట
గార్లుబూర్లు చేస్తరంట భోగిపళ్ళు పోస్తరంట
పంట ఇంటి కొస్తదంట సంబరాలు చేస్తరంట
పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా
కొడకా అది మనకుగాదు ఆదారిన నువ్వుబోకు
పండగంటు పేరు పెట్టి తెగ తిందురు మారాజులు
మనకేమో పొట్టనిండ తిన్న దినమే పండగరా
ఆట పాటలంటావా అదిలేని దినమేదిర?
లేనిరోజు పస్తులుంట మరిచినావురా బిడ్డా ?
భోగిమంటలంటావా? చలికాగుదురంటావా ?
కడుపుమంట రగులుతుంటే చలిదాపుకు రాదు గదర
గారె బూరెలంటావా? మారాజులు మెక్కినాంక పాసికూడు తెద్దువులే !!
కొడకా అది మనకుగాదు ఆదారిన నువ్వుబోకు
కంటినీరు తుడువు బిడ్డ నాటకాలు ఆపు బేట
బయట ఉన్న నూకలోని పురుగులూది లోపలెట్టు
మనకొంపకు వచ్చేటి పంటదిరా ముద్దు బిడ్డ
నేలపాలు సేయమాక వీపుమోత మోగిపోద్ది
గంజి నీకు కాసిత్తా గమ్మున కునుకేయి పోయి !!
వాడి కడుపు మంట తెచ్చే
భోగి మంటల వేడి నాకు
వాడి మాటల తీరు తెచ్చే
ఎద్దు గంటల హోరు నాకు
వాడి ఆకలి కేక తెచ్చే
వేడి గారెల త్రేన్పు నాకు
వాది బాధల మూల్గు లిచ్చే
దాసు భజనల గుర్తు నాకు
వాడు చెరిపిన కంటి నీరే
చేదు నిజమై కలము కదిలెను
పండుగన్నది ఒకరి సొత్తుగ
మిగల రాదని నీతి తెలుపగ
తోటి వారికి సంబరాల్లో పాలు పంచుతు చేయి నిస్తే
బక్కచచ్చిన ఎన్నో మనసులూ పండుగలకు ఎదురు చూస్తాయి !!
నేను ఎప్పుడొ రాసిన కవితను తిరిగి కాస్త కొత్తదనాన్ని చేర్చి మళ్ళి సందర్భం వచ్చింది కనక అందిస్తున్నాను
ఆనందాన్ని అందరికీ పంచుదాం అదే నిజమైన పండగ
మీకందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...