తెరెపిచ్చిన ముసురు
=============
నింగి నల్ల జుట్టు విరబోసుకుని
సూరీడ్ని తనవెనక దాచేసుకుని
వెండి కొరడాలు ఝుళిపిస్తూ గర్జిస్తోంది
దాని శ్వాస గంధాలు మత్తెక్కిస్తున్నా
మింగ వచ్చిన చీకటి నోళ్ళకి భయపడి
నా నీడా నాలోకి దూరిపోయింది.
ముసురు గంప కింద మా ఊరూ దాక్కుంది
ముసుగులో సూరీడు గోలచేసినట్టున్నాడు
నోట్లోపడ్డ పీచు మిఠాయిలా మబ్బులు కరిగి
వెండి కొరాడాలని భుజాన వేసుకుని వెళుతూ
కొండమీద పడ్డ ఆ కాస్త నలుపూ తీసుకెళుతున్నాయి
తను దూరమయినందుకు పరిహార మేమో, సూరీడు
బంగారు తళుకుల్ని చెట్టు కొమ్మల మీద అద్ది,
గడ్డి పోచల మీద ముత్యాలు పోసి,
వెచ్చ కౌగిలిచ్చి ఊరడించాడు, దాక్కున్న మానీడ తిరిగి
చీకటి
====
నింగి నిండిన చీకటి, చుక్క రంధ్రాల్లోనించి
ఆరు బయట ఆక్రమించి, తనువు పెంచి
కొత్త తావులెతుక్కుంటూ నిశ్శబ్దంగా
తలుపు సందుల నుంచి నట్టింట్లోకి దూరొచ్చి
దీపం చూడని మూలల్లో నక్కి కూర్చుంది
కొంత కొవ్వొత్తి కింద చేరి దోబూచు లాడుతుంది
గురువింద మచ్చలాగా మనిషికొచ్చే చావులాగ
ఆశ కొవ్వొతి చుట్టూ బాధ చీకటి పలచబడుతుంది
బ్రతుకు నింగి ఉదయం కోసం ఎదురు చూస్తుంది
బయట ప్రపంచం ఆదమరచే ఉంది
కొవ్వొత్తి ఒక్కటే కాపలా కాస్తుంది
కల
===
చెలి గాలి సోకింది- చెంప చేను పరవసించి ఎర్ర పూలు పూసింది
ఆమె తలపు తగిలింది - మాట తోట మురిసిపోయి మల్లె పూలు విసిరింది
ఆమె శ్వాస తడిమింది - సెగలు తగిలి రేయి లేచి గజ్జె కట్టి ఆడింది
ఆమె చూపు గుచ్చింది - కవిత ముసుగులోకి దూరి గుండె అంగలార్చింది
ఆమె చేయి తగిలింది - ప్రాణమొచ్చి జ్ఞాపకాలు అల్లిబిల్లి తిరిగాయి
ఆమె తట్టి లేపింది - నిద్ర చెదిరి బద్ధకంగ మనసు మూగబోయింది
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...