13, జనవరి 2009, మంగళవారం

ఎదురు చూపు - ఒకటవ భాగం

వణుకుతున్న కిటికీ తలుపులు గొళ్ళెమేయమని చేసే గొడవ ...
రోజు మారకముందే చిరిగి ఎగిరేలా హడలుగొట్టే గోడ కాలెండరు ...
ఇల్లంతా తనదన్నట్టు సొదా చేస్తూ ఈలలు వేసే ఈదురు గాలి...

అలిసి నేలరాలి, అంచు చేరిన అలల్లా తిరిగి ఎగిరే దుమ్ము వృత్తాలు ...
తిండిదొరక్క పల్లెపై పడ్డ గున్న ఏనుగుల్లా నింగి చేరిన నల్ల మేఘాలు...
దూరంగా చావు డప్పులా వస్తు పోతు వినిపించే తుఫాను హెచ్చరిక...

సముద్ర తీరమది
దూరంగా ఒంటరి ఇల్లది
ఒకప్పటి సాయంత్రం కధ ఇది

అటునిటు తిరుగుతు ఆతృత చెందుతు అడుగుల సవ్వడి కొరకై వెదుకుతు
వడివడి పరుగిడి ద్వారము చెంతన తనపతి కానక వికలం అగుసతి

మారాం చేస్తూ నాన్నేడంటూ గారాం పోతూ రాడేఅంటూ
మాకూ నాన్నే కావాలంటూ కొంగుల్లాగే బిడ్డల్నాపి పోరా
పోరా పోపొమ్మంటూ విసుగును చూపి కసిరే అమ్మ

హోరును పెంచిన ఈదురు గాలులు, జోరును సాగిన వాన ధారలు
కడలిలొ పెరిగిన అలల జలాలు, సడలిన పిల్లల గుండె బలాలు,
పెరిగిన ఆతృత మనసులనుండి ఆప్యాయతగా పారిన సమయం
నింగిన నిండిన నల్లని మబ్బులు, ఇమడక గుండెలొ జారిన తరుణం

అమ్మ రెక్కలో దూరిన పిట్టలా, భయపడి నక్కిన పిల్లలు పక్కన
అమ్మను చూస్తూ నాన్నేడంటూ వణికే స్వరమున మళ్ళీ అడిగితే
జవాబు తెలియక తనకీ కానక సతమతమయ్యెను పాపం ఆమె
నిండిన కన్నుల జారే ధారలు వీధికి అద్దిరి అందరి చూపులు

మెరుపు దెబ్బకి ముక్కలు కాగా నింగి తునకలు శబ్దం చేస్తూ
పెరటి మూలగల విద్యుత్‌ పెట్టెపైగూలి చూపెనిక కాంతుల చిందులు
అప్పటివరకు వెలిగిన దీపము ఎదురు చూపుల గుంపున కలిసి
ఎవరికోసమో తెలియక పోయినా వీధిని చూస్తూ నిలబడి ఉంది.

బయట చీకటి ఇంట చీకటి
కంటి రెప్పలను దొప్పలు చేసిరి
ఆశను నూనెగ అందున నింపిరి
ఆతృత ఒత్తిగ అందుకు నేసిరి
మండె గుండెల జ్వాలను తీసిరి
ప్రేమను దీపము నట్టింటెట్టి

తండ్రి కోసమా తనయుల చూపులు
భర్త కోసమా అమ్మడి ప్రార్ధన



(సశేషం ... )

వాన ఆగేనా ? కలత తీరేనా ?
ఆశతీరేనా ? అతను వచ్చేనా ?

రెండో భాగంలో చూడండి