29, డిసెంబర్ 2008, సోమవారం

అడవితల్లి ఒడిలో

చింత చెట్టు ఊడలల్లో
పసిబిడ్డడి ఊయల - వ్యత్యాసాల ఊపుకి ఊగుతుంది
ఆకలి పుడకల కొంపలో
వేదన చితుకుల పొయ్యి - ఆకలి మంట మండుతుంది
వ్యతిరేకత మూకుడులో
బ్రతుకు అంబలి కాగుతుంది - ఎవరి ఆకలో తీరనుంది

గుప్పెట్లో దాచిన గుక్కెడు దాహంలా
కడుపు నిండని నిన్న, ఈరోజు మళ్ళీ
వాడి గుడిసెలోకి జారుతుంది - యముని పాశంలా

ఊదుగొట్టం లోకెళ్ళిన ఊపిరి
పొగలా గూడెం నిండుతుంది
వేగులా ఉనికిని తూటాలకిస్తుంది - ఎన్కౌంటరు పావురం ఎగురుతుంది

వాడి రేపు ఎర్రక్షరాల్లో పేపరెక్కుతుంది,
రంగు పీలికలై కాకీ చొక్కాకి అంటుతుంది
ఖద్దరు చొక్కా చేతులు కడుక్కుంది - ఎండిన డొక్క బావురంటుంది

పేదరికపు గీత పైకెగిరి జాతి పురోగతి చాటుతుంది
ఈ గాయం మానకముందే

అడవిలో చింత చెట్టుకింద
మరో ఊయల వేళాడుతుంది
మరో గాడిపొయ్యి మొదలవుతుంది
వాడి గద్గద స్వరం రేగుతుంది
అడవితల్లి ఒడిలో వేగు పొగ ఎగురుతుంది
గద్దరు స్వరం సాగుతుంది
తూటాల తప్పెటా సాగుతుంది