అటక మీద దొరికిన ఫొటో మీద
దుమ్ము దులిపేసరికి
పాతికేళ్ళ నాటి ఘటనొచ్చి
నట్టింట్లో పడింది
"ఇవి మార్కులా" హస్తం గుర్తును
నా చెంప మీద చూపిన
నూనూగు మీసాల
కాంగ్రెస్ వాది ముందు గదిలో
"మీ ఆఫీసరుగారబ్బైకి చక్రాలొచ్చాయండీ"
వంటింట్లోనుంచి ముందుగది దాకా సాగిన
అమ్మ సముదాయింపు స్వరం
"తప్పిన వాళ్ళల్ల్లో ఎక్కువ మార్కులొచ్చింది
అన్నాయికే " అంటూ తన లాజిక్కుతో
అడ్డకాలేసి సైకిలు తొక్కుతూ, కాపాడొచ్చిన తమ్ముడు
"వెధవ చదువులు పరీక్ష పెట్టటమెదుకు?
తప్పించడం ఎందుకు ? అందుకే నేబడికే వెళ్ళలేదు" అంటూ
అమ్మమ్మ సమర్ధింపు సణుగుడు, పూజ గదిలోనుంచి
బిక్క మొఖం, వంచిన తల, తడిసిన కళ్ళు,
ముక్కు బలపాలు, బొందుల నిక్కరు, దొంగ చూపులు
ఫొటోలో ఉన్నది ఇంతే ఐనా, దాని వెనక ఎంత కధ ఉందో !
గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...