12, జూన్ 2007, మంగళవారం

అమ్మ ఇవ్వాళ సంక్రాంతిట అంటె ఏమిటి?

అమ్మ ఇవ్వాళ సంక్రాంతిట అంటె ఏమిటి?
తిండి దొరుకుట మనకి - జాప్య మయ్యె రోజని!!

బొమ్మలకు కొలువులట, కోడి పందాలట
సరదాల సమయము మనకి - పరదాల లోనె కదరా!!

హరిదాసు చిడతలట, గంగి రెద్దు గంటలట
ఆకలి కేకలె మనకి - కన్నీటి తప్పెట్లు

సంక్రాంతి సరదాలట, పిల్లలకి సెలవలట
రోజు గడవదు మనకి - చావొకటె మన సెలవ

ముగ్గుల్లొ పిడకలు పెట్టేటి దినమిదిట
ఆ సమయమె మనకి - పొట్ట నిన్పేదిరా బిడ్డా

గారే బూరెలు వారు చేసేటి పండగట
నిన్న గంజే మనకి - పరమ భాగ్యమ్ము

కొత్త అల్లుడింట సంబరాలు తెచ్చాట్ట
కొంపకొస్తె నీ అయ్య - పదివేలు అది మనకి

భోగి మంట లవిగో చలి ఇంక పోవునట
చింకి పాతే మనకి - చలి ఆపేనిన్నాళ్ళు

పాడి పంటలింట వచ్చేటి సమయమిదట
పురుగు పట్టినా మనకి - పరమాణ్ణమే ఆ గింజ

అందరూ సంక్రంతి సంబరాలే చూస్తుంతే
సంబరాలు చేసుకోలేని వారి సంగతేంటి?

వాడి కంటి నీరు నిచ్చె - భోగి మంటల సెగను నాకు
వాడి మాటల తీరు నిచ్చె - బసవ గంటల హోరు నాకు
వాడి ఆకలి కేక లిచ్చె - వేడి గారెల రుచులు నాకు
వాడి బాధల మూల్గు లిచ్చె - హరిదాసు గాధల గురుతు నాకు
వాడి జీవితం సాక్ష్య మిచ్చె - భావి పౌరుని ఘోష నాకు
వాడి గోడొక బావుటాగ
వాడి మాటొక స్ఫూర్తి కాగ
నా నోట రాలిన ఈ చిన్న నిప్పు
రగిలి కాంతులు ప్రజ్వరిల్లగ

తోటి వారికి సంబరాల్లో
పాలు పంచుతు చేయి నిస్తే
బిక్క చచ్చిన ఎన్నో మనసులు
సంబరాలకి ఎదురు చూచును!!!