31, జనవరి 2009, శనివారం

ఏమని చెప్పను

వెదురు గుండెకు గాయం చేసి వేణువులా మోగ మనే
తిరిగి బ్రతికిన జ్ఞాపకానికి ఏమని చెప్పను

గుండె గుంటలో బండను తోసి అలల కోసం
కలల కొమ్మపై కాపేసిన కాలానికి ఏమని చెప్పను

గుండె మంటలొ గతాన్ని పోసి రగిలే సెగలో చలికాచుకునే
విగత క్షణాలకు ఏమని చెప్పను

విధి గీసిన చీకటి దారుల్లో వేదన మంటలే ఆశ్రయమిస్తే
అవీ ఆర్పిన కంటి జల్లులకేమని చెప్పను

30, జనవరి 2009, శుక్రవారం

కన్నీళ్ళు

కలగంటున్న యెదగల హితుడవు
వలదంటున్నా కదలని తపనవు
వ్యర్ధం అన్నా వదలని గోడువి
అభ్యర్ధనకూ కరగని వాడివి

హృదయం ఉన్నా పంచగ లేనని
పరిమితులేవో నాకూ గలవని
చెప్పిన మాటలు పెడచెవి పెడితివి
ఇచ్చిన అలుసును తప్పుగ చూస్తివి

ఇప్పుడు చూడు ఏమయ్యిందో
కురులే ఉరిగా బిగిసిన కంఠం
బంగరు బహుమతె నీ బలి పీఠం
నా చెక్కిలి నేర్పెను నాకో పాఠం

ప్రేమే నాపై నిజముగ ఉంటే
చేసిన వినతులు నువ్వే వింటే
ప్రాణం నీకు మిగిలుండేది
బ్రతుకున హితుడుగ ఉండేవాడివి

నా కన్నీళ్ళు నిను తేలేవు
అదితెలిసినా ఈనీళ్ళు

http://pruthviart.blogspot.com/2009/01/blog-post_29.html కు నా స్పందన.

29, జనవరి 2009, గురువారం

ప్రేమ

చెలియ చింతన చెక్కిళ్ళు కడిగె
మనిషి చింతన కన్నీళ్ళ మునిగె
మనసున మొలిచెను పచ్చని ఆశలు
గతమును విడమనె వెచ్చని బింబము

విధి పరిచిన వల ఈ గతము
గడచిన ఘడియలు వేసిన ముడులవి

రమ్మని పిలిచెడి ప్రేమొక ఎర
పదునగు కత్తిని దాచిన ఒర

అందని ప్రేమకు బ్రతుకుని చంపకు
అందిన ప్రేమను బ్రతుకని చెప్పకు
బ్రతుకున ప్రేమొక భాగము ఎరుగుము
గతమొక బాధల బ్రమయని తెగడుము

చెమరిన కన్నులు తుడిచే సమయం
బ్రతుకును ముందుకు నడిపే తరుణం
గగనపుటంచులు తాకే సమయం
అదిగో చూపెను కనబడు ఉదయం
http://pruthviart.blogspot.com/2009/01/blog-post_28.html కు నేను రాసిన స్పందన

27, జనవరి 2009, మంగళవారం

చినుకులు

తెరెపిచ్చిన ముసురు
=============


నింగి నల్ల జుట్టు విరబోసుకుని
సూరీడ్ని తనవెనక దాచేసుకుని
వెండి కొరడాలు ఝుళిపిస్తూ గర్జిస్తోంది

దాని శ్వాస గంధాలు మత్తెక్కిస్తున్నా
మింగ వచ్చిన చీకటి నోళ్ళకి భయపడి
నా నీడా నాలోకి దూరిపోయింది.
ముసురు గంప కింద మా ఊరూ దాక్కుంది

ముసుగులో సూరీడు గోలచేసినట్టున్నాడు
నోట్లోపడ్డ పీచు మిఠాయిలా మబ్బులు కరిగి
వెండి కొరాడాలని భుజాన వేసుకుని వెళుతూ
కొండమీద పడ్డ ఆ కాస్త నలుపూ తీసుకెళుతున్నాయి

తను దూరమయినందుకు పరిహార మేమో, సూరీడు
బంగారు తళుకుల్ని చెట్టు కొమ్మల మీద అద్ది,
గడ్డి పోచల మీద ముత్యాలు పోసి,
వెచ్చ కౌగిలిచ్చి ఊరడించాడు, దాక్కున్న మానీడ తిరిగి

చీకటి
====

నింగి నిండిన చీకటి, చుక్క రంధ్రాల్లోనించి
ఆరు బయట ఆక్రమించి, తనువు పెంచి
కొత్త తావులెతుక్కుంటూ నిశ్శబ్దంగా
తలుపు సందుల నుంచి నట్టింట్లోకి దూరొచ్చి
దీపం చూడని మూలల్లో నక్కి కూర్చుంది
కొంత కొవ్వొత్తి కింద చేరి దోబూచు లాడుతుంది
గురువింద మచ్చలాగా మనిషికొచ్చే చావులాగ

ఆశ కొవ్వొతి చుట్టూ బాధ చీకటి పలచబడుతుంది
బ్రతుకు నింగి ఉదయం కోసం ఎదురు చూస్తుంది
బయట ప్రపంచం ఆదమరచే ఉంది
కొవ్వొత్తి ఒక్కటే కాపలా కాస్తుంది


కల
===

చెలి గాలి సోకింది- చెంప చేను పరవసించి ఎర్ర పూలు పూసింది
ఆమె తలపు తగిలింది - మాట తోట మురిసిపోయి మల్లె పూలు విసిరింది
ఆమె శ్వాస తడిమింది - సెగలు తగిలి రేయి లేచి గజ్జె కట్టి ఆడింది
ఆమె చూపు గుచ్చింది - కవిత ముసుగులోకి దూరి గుండె అంగలార్చింది
ఆమె చేయి తగిలింది - ప్రాణమొచ్చి జ్ఞాపకాలు అల్లిబిల్లి తిరిగాయి
ఆమె తట్టి లేపింది - నిద్ర చెదిరి బద్ధకంగ మనసు మూగబోయింది



26, జనవరి 2009, సోమవారం

ఉదయం

తూర్పు కొండల మీదనించి కాంతి తీగల గాలమేసి
నిద్ర లేచిన పగలు, రాత్రి దుప్పటి లాగుతుంటే
ఒళ్ళుమండిన సూరీడు బద్ధకంగా నిద్ర లేచి
తన కోపము నింగి నిండా పరిచినట్టున్నాడు
భయపడ్డ పొద్దుతిరుగుడు చేలు నిక్కబొడుచుకున్నాయి
గువ్వ పిట్టలు గూళ్ళనొదిలి తుర్రు మన్నాయి
అది చూసి తోటలో పూలన్ని గొల్లు మన్నాయి

ఉదయం

25, జనవరి 2009, ఆదివారం

మబ్బు దిండు చిట్లి నట్టు పత్తి పూల వాన నేడు

మబ్బు దిండు చిట్లి నట్టు పత్తి పూల వాన నేడు
వెన్న ముద్ద లెన్నో పూసె చెట్టు కొమ్మ లన్ని చూడు

వెన్నె లంత గుట్ట పోసి మిన్న కుండె నింగి రేడు
చల్ల దూది పింజ తోటి ఆట లాడె పిల్ల గాడు
అమ్మ చేతి చల్ది ముద్ద లోక మంత పెద్ద దయ్యె
నోట బెట్టి మింగ బోవ మాయ మయ్యె నేమి చెప్ప .. !! మబ్బు దిండు

వాడి బుగ్గ పూలు పూసె చేతి వేళ్ళు వంగి పోయె
ముక్కు ధార కారు డాయె నోటి పొగల ఆట లాయె
మంచు బంతి చేసి వాడు ఇళ్ళ పైకి రువ్వు డాయె
పిల్ల గుంపు లన్ని జేరి మంచు బొమ్మ చెక్కు డాయె .. !! మబ్బు దిండు

నేల బడ్డ వెన్నె లంత కాస్త కాస్త మాయ మైతె
చంటి గాడి కళ్ళ లోన పొర్లు కొచ్చె బాధ వాన
కారు ముక్కు పీల్చు కుంటు బుంగ మూతి పెట్టు కుంటు
ఎర్ర బుగ్గ మీద కారు వాడి గోడు చూస్తు ఉంటే ..

సంధ్య పొద్దు తోట లోన ఎర్ర మొగ్గ చెంప మీద
ముత్య మోటి వచ్చి నిల్చి ముద్దు పెట్ట మన్నట్టుండె ..!! మబ్బు దిండు

24, జనవరి 2009, శనివారం

అపరిచితులు

ఒకే దారిన పోతున్నాం
బ్రతుకు మూట భుజానేసుకుని
ఆశ వెలుగులో దార్లు వెతుకుతూ
అడియాశ మలుపులు వెనక వదులుతూ
తిరిగిన దారులు గుర్తు చేసుకుంటూ

ఒకే కాలాన్ని గడుపుతున్నాం
మన గతపు గంపల గాధలు పంచుకుంటూ
కొత్త కధలను అల్లుకుంటూ
తడబడు నడకలు సవిరించికుంటూ
ఒకరికి ఒకరు ఆధార మవుతూ

ఈ బంధానికి పేర్లు వెదికి
ఓడిన వారెందరో,
అలిసి ఆగిన వారెందరో
పేరు పెట్టి విరిగిన వారెందరో
పిలిచి దాని విరవటమెందుకు ?

మన బంధానికి పేరులొద్దు
ఒకరికి ఒకరు తోడుగా
ఎవరి గమ్యం వారు చేరుకుందామా ?
ఇలా కలిసి తిరిగిన అపరిచితులుగానే సాగి పోదామా ?
చివరికి మన గతాల్లోనే మిగిలి పోదామా ?
సమసి పోదామా ?