2, జనవరి 2009, శుక్రవారం

నీ పిలుపు

ఏడు జలధుల ఆవల నుంచి
హల్లో అంటూ వచ్చిన పిలుపు
ఎదలో మల్లెలు కురిసేటట్టు
మరువపు తావిని విసిరేటట్టు
గుండెను తాకిన విచిత్ర వైనము
ఒక్క ముక్కలో చెప్పేదెట్లా ?

ఆ ఆనందానికి అవధులులేవు
ఏ కొలతలు దానికి సామ్యం కావు
బాగున్నావా ? ఆ ఒక్క మాటతో

బరువు బంధాలు బద్దలయ్యాయి
కళ్ళు చెమర్చి తేలికయ్యాయి
గుండెలు రెక్కలు తొడుక్కున్నాయి
నీ ఊసులు మనసులో నిండిపోయాయి
కాళ్ళు గాలిలో తేలిపోయాయి
నింగి అంచులు పరిచయమయ్యాయి

కొత్త వత్సర ఘడియలు నన్ను
ప్రేమగా గుండెకు హత్తుకున్నాయి
తడిసిన కళ్ళను వేలితో తుడుచుకున్నాయి



EDu jaladhula aavala nunci
hallO anTuu vaccina pilupu
edalO mallelu kurisETaTTu
maruvapu taavini visirETaTTu
gunDenu taakina vicitra vainamu
okka mukkalO ceppEdeTlaa ?

aa aanamdaaniki avadhululEvu
E kolatalu daaniki saamyam kaavu
baagunnaa ? aa okka maaTatO

baruvu bandhaalu baddalayyaayi
kaLLu cemarci tElikayyaayi
gunDelu rekkalu toDukkunnaayi
nee uusulu manasulO ninDipOyaayi
kaaLLu gaalilO tElipOyaayi
ningi anculu paricayamayyaayi

kotta vatsara ghaDiyalu nannu
prEmagaa gunDeku hattukunnaayi
taDisina kaLLanu vElitO tuDucukunnaayi

చినుకులు

శ్వాస
-----
చల్లగా నాలోకి జారుకుంటుంది
చేరి ఉపశమిస్తుంది
చలికాగి చిన్నగా పారిపోతుంది

రోడ్డు
-----

డుగులు మోసుకుంటూ
నిశ్చలంగా సాగుతుంది
ఆనందంగా ఓలలాడుతుంది

కవిత
----

కళ్ళలోకి దూరిపోయి తన
అందాలను గుండెల్లో చూసుకుంటుంది
స్పందించి కాగితంపైన ఆడుకుంటుంది

సూరీడు
----------
మునివేళ్ళతో గిచ్చి లేపుతుంటాడు
తలుపు సందులోనుంచి జారుకుంటాడు
లేచి చూసే సరికి మండుతున్నాడు

31, డిసెంబర్ 2008, బుధవారం

శుభాకాంక్షలు

మిత్రులందరికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ వత్సరం నూతన వెలుగులు తేవాలని
మనసారా ఆకాంక్షిస్తున్నాను.

30, డిసెంబర్ 2008, మంగళవారం

అనుభవాలు

భావ పాతాలు గుండె శిలలను చేరుకుంటూ
తలలు పగిలేలా మూర్కొంటున్నాయి
బ్రతుకు ఒరవడి తాళలేక పల్లాలని వెదుక్కుంటూ
ఆత్మహత్యను చేసుకుంటున్నాయి

చావచచ్చిన శకలాలు ఉపరితలంపైన ఆడుకుంటాయి
ఏమీ పట్టనట్టు సాగిపోతాయి - నవ్వుకుంటాయి
చచ్చిబ్రతికిన ఆనవాళ్ళు తెట్టుతోడై ఒడ్డు చేరుకుంటాయి
అనుభవాలై గతంలో పొందికగా సద్దుకుంటాయి

జ్ఞాపకాలై మధనపెడుతు విందుచేసుకుంటాయి



bhaava paataalu gunDe Silalanu cErukunTuu
talalu pagilElaa muurkonTunnaayi
bratuku oravaDi taaLalEka pallaalani vedukkunTuu
aatmahatyanu cEsukunTunnaayi
caavacaccina SakalaalE uparitalampaina aaDukunTaayi
Emii paTTanaTTu saagipOtaayi - navvukunTaayi
caccibratikina aanavaaLLE teTTutODai oDDu cErukunTaayi
anubhavaalai gatamlO pondikagaa saddukunTaayi
jnaapakaalai madhanapeDutu vinducEsukunTaayi

నీడ

గాలి కాపరి తోలుతున్నా
మబ్బు మేకలు కదలలేదు
జాలి తలపులు వేడుతున్నా
నిప్పు కీలలు అణగలేదు
మెరుపు ఝళుపులు తగులుతున్నా
మరుపు మెళుకువ దరికిరాదు
నిజం చూపులు నిండుతున్నా
నీడ నాతో వెంటరాదు

gaali kaapari tOlutunnaa
mabbu mEkalu kadalalEdu
jaali talapulu vEDutunnaa
nippu keelalu aNagalEdu
merupu jhaLupulu tagulutunnaa
marupu meLukuva darikiraadu
nijam cuupulu ninDutunnaa
neeDa naatO venTaraadu

29, డిసెంబర్ 2008, సోమవారం

అడవితల్లి ఒడిలో

చింత చెట్టు ఊడలల్లో
పసిబిడ్డడి ఊయల - వ్యత్యాసాల ఊపుకి ఊగుతుంది
ఆకలి పుడకల కొంపలో
వేదన చితుకుల పొయ్యి - ఆకలి మంట మండుతుంది
వ్యతిరేకత మూకుడులో
బ్రతుకు అంబలి కాగుతుంది - ఎవరి ఆకలో తీరనుంది

గుప్పెట్లో దాచిన గుక్కెడు దాహంలా
కడుపు నిండని నిన్న, ఈరోజు మళ్ళీ
వాడి గుడిసెలోకి జారుతుంది - యముని పాశంలా

ఊదుగొట్టం లోకెళ్ళిన ఊపిరి
పొగలా గూడెం నిండుతుంది
వేగులా ఉనికిని తూటాలకిస్తుంది - ఎన్కౌంటరు పావురం ఎగురుతుంది

వాడి రేపు ఎర్రక్షరాల్లో పేపరెక్కుతుంది,
రంగు పీలికలై కాకీ చొక్కాకి అంటుతుంది
ఖద్దరు చొక్కా చేతులు కడుక్కుంది - ఎండిన డొక్క బావురంటుంది

పేదరికపు గీత పైకెగిరి జాతి పురోగతి చాటుతుంది
ఈ గాయం మానకముందే

అడవిలో చింత చెట్టుకింద
మరో ఊయల వేళాడుతుంది
మరో గాడిపొయ్యి మొదలవుతుంది
వాడి గద్గద స్వరం రేగుతుంది
అడవితల్లి ఒడిలో వేగు పొగ ఎగురుతుంది
గద్దరు స్వరం సాగుతుంది
తూటాల తప్పెటా సాగుతుంది

వస్తావు కదూ ?

మంచు ముసుగులో వసంతం కోసం
నగ్నంగా తపస్సు చేసే మానులా
ఋతువు ముసుగులో తొలకరి కోసం
ఆబగా ఎదురు చూసే చకోరంలా (/ఆలుచిప్పలా)
నేల ముసుగులో పుఠం కోసం
మకిలిలా ఎదురు చూసే బంగారంలా
ఆశ ముసుగులో నీకోసం
ఉలి తగలని శిలలా ఎదురు చూస్తున్నాను
కాల చక్రం నావైపు మొగ్గదని తెలుసు
ఐనా నీకోసం ఎదురుచూస్తున్నాను
వాటిని చేరిన అచంచల నమ్మకం
నా రెప్పల వెనక నీళ్ళ పొరలా ఆవహించింది
వాటినార్పి ఆశను చెక్కిళ్ళపై జార్చలేను
ఆర్పక నీ రాక మసక చేసుకోలేను
కదలని నా కళ్ళలోగిళ్ళు
సంక్రాంతి ముంగిళ్ళై రంగులమర్చుకుంది
వస్తావన్న ఆశ ఇంకా నా కళ్ళనిండా ఉంది
వస్తావు కదూ ?



mancu musugulO vasantam kOsam
nagnamgaa tapassu cEsE maanulaa
Rtuvu musugulO tolakari kOsam
aabagaa eduru cuusE cakOramlaa
nEla musugulO puTham kOsam
makililaa eduru cuusE bangaaramlaa
aaSa musugulO neekOsam
uli tagalani Silalaa eduru cuustunnaanu
kaala cakram naavaipu moggadani telusu
ainaa neekOsam edurucuustunnaanu
vaaTini cErina acancala nammakam
naa reppala venaka neeLLa poralaa aavahincindi
vaaTinaarpi aaSanu cekkiLLapai jaarcalEnu
aarpaka nee raaka masaka cEsukOlEnu
kadalani naa kaLLalOgiLLu
sankraanti mungiLLai rangulamarcukundi
vastaavanna aaSa inkaa naa kaLLaninDaa undi
vastaavu kaduu ?